అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అన్నట్టుగా తయారైంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్రఅధ్యక్షుడు.. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గానికి ఎంపీ..తెలంగాణలో అత్యధిక మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో ఒకడు. డబ్బులకు కొదవ లేదు.. డైలాగుల విషయంలోనూ కొట్టేవాడే లేడు.ఇలా కావాల్సినన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎందుకో రేవంత్ రెడ్డికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దక్కాల్సినంత కవరేజ్ దక్కడం లేదన్నది ఆయన అభిమానుల మాట. కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్న ఛానెల్సే కాదు.. మిగిలినవాటిలోనూ అదే పరిస్థితి ఎదురవుతోందని వారు చాలా బాధపడిపోతున్నారు. వాస్తవానికి వాళ్ల ఆవేదనలోనూ నిజం లేకపోలేదు.
రేవంత్ ఏదైనా భారీ బహిరంగ సభ నిర్వహించినప్పుడో.. ఏదైనా అతి ముఖ్యమైన అంశంపై ప్రెస్ మీట్ పెట్టినప్పుడో లేదా మరేదైనా విషయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినప్పుడో వంటి సందర్బాల్లోనే మాత్రమే రేవంత్ రెడ్డికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కాస్త స్క్రీన్ స్పెస్ దొరుకుతోంది. అదికూడా ఏదో నాలుగు నిమిషాలు బ్రేకింగ్ ప్లేట్లు వేసి అటూ, ఇటూ తిప్పి ఆ మేటర్ ని ముగించేస్తున్నాయి .మళ్లీ ఆయన గురించి ఏ న్యూస్ ఛానెల్ లోనూ వార్తే వినబడటం లేదు. వార్తపత్రికలది దాదాపుగా అదే దారి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఫస్ట్ పేజీలో రావాల్సిన వార్తని.. ఏదో మూలకు తోసిపారేస్తున్నాయి. పోనీ రేవంత్ రెడ్డిని అన్నివేళలా ఛానెళ్లూ, పత్రికలు అలాగే లైట్ తీసుకుంటాయా అంటే అసలే కాదు.. ఆయనకు వ్యతిరేకంగా ఉండే వార్తలకు మాత్రం కావాల్సినంత కవరేజ్ ఇస్తుంటాయి. అలా అని ఆయనపై ఏదో పగతోనే అలా చేయవు.. అలాంటి వార్తలకు రేటింగులు దూసుకుపోతుంటాయనేది వాటి లెక్క.
నిజానికి మీడియా తనపై పక్షపాతం చూపిస్తోందని స్వయంగా రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఓపెన్ గానే చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలే తనకు అతిపెద్ద మీడియా అని, మీడియా తనకు కవరేజ్ ఇవ్వకపోయినా పరవాలేదని లైట్ తీసుకున్నారు. మొదట్లో రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కేడర్ కూడా మీడియా కవరేజ్ విషయాన్ని లైట్ తీసుకున్నారు కానీ.. ఈ మధ్య వారికీ మెయిన్ స్ట్రీమ్ మీడియాపై అసహనం పెరిగిపోతోంది. ఎన్ని పోరాటాలు చేసినా.. తమ గురించి చిన్న వార్తయినా రాయడం లేదని సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి కూడా వెళ్లగక్కుతున్నారు. రేవంత్ రెడ్డిపై ఈ అంతర్గత నిషేధం ఎందుకు తెలియదు కానీ.. అసలే ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. రేవంత్ రెడ్డి కాస్త మీడియా మేనేజ్మెంట్ తెలుసుకోవాలేమో అన్నది ఆయన అభిమానుల సలహా.
కొ న్ని రాజకీయ వార్తలకు సంబంధించి… ఉద్దేశపూర్వకమైన యాంటీ జగన్ స్టోరీలకు సంబంధించి… ఆంధ్రజ్యోతి పాత్రికేయం పరమ చికాకు యవ్వారం..! కానీ అవి వదిలేస్తే చాలాసార్లు తనను మెచ్చుకునే పరిస్థితిని క్రియేట్ చేస్తాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… ఏపీ పాత్రికేయం ఓ భ్రష్టుపట్టిన తంతు… కానీ తెలంగాణ విషయానికొస్తే రాయాల్సింది బోలెడు… కానీ… ప్రతి పత్రిక నమస్తే తెలంగాణను మించి కేసీయార్ను, తన పథకాల్ని కీర్తిస్తూ, ఆ సేవలోనే పునీతమై తరిస్తోంది… చివరకు నిష్పాక్షికంగా ఉండాల్సిన, ఉండతగిన సాక్షి కూడా నమస్తే సాక్షి అయిపోయింది… మించిపోయింది… చదవబుల్ వార్తొక్కటీ లేదేమని పాఠకజనం తిరస్కరిస్తుంటే, ఛీత్కరిస్తుంటే, పత్రికలో పనిచేసే వాళ్లందరమూ తలా పది పేపర్లు అమ్ముకుందామనే బృహత్ సంకల్పం తీసుకుంది… ఇక ఏనాడో వెన్ను వంగిపోయిన ఈనాడు గురించి చెప్పుకోవడం ఉత్త దండుగమారి ప్రయాస… అదిప్పుడు నిప్పులు (ప్రొఫెషనల్ ఫైర్) ఆరిపోయి, కనిపిస్తున్న ఓ బూడిద వార్తల కుప్ప… ఎస్… పత్రిక అంటే భజన కాదు… అవసరమైనప్పుడు అది ‘కాగ్’ పాత్ర పోషించాలి… అవసరంగా మారి ఫ్యాక్ట్ ఫైండింగ్ మెకానిజంగా మారాలి… దర్యాప్తులు చేయాలి… గూఢచర్యం కూడా తప్పదు… జనం వెంట నిలవాలి…
Comments
Post a Comment